ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోరులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 51 డివిజన్లలో పోటీ చేస్తోంది. అలకలు, బుజ్జగింపులు, సర్దుబాట్లు వగైరాలతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం సీపీఐకు గుంటూరు తూర్పులో రెండు డివిజన్లు కేటాయించారు. గుంటూరు పశ్చిమలో రెండు డివిజన్లలో, ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గుంటూరు కార్పొరేషన్‌ కిందకు వచ్చే రెండు డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ముఖం చాటేశారు. 

మొదటి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా ప్రహసనంలా సాగిందన్న వాదన వినిపిస్తోంది. బలమైన అభ్యర్థులు సంబంధిత డివిజన్లలో దొరక్కపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని, ఫలితంగా పోలింగ్‌కు ముందే 48వ డివిజన్‌ను టీడీపీ కోల్పోవాల్సి వచ్చిందని పలువురు ఆ పార్టీ  నాయకులు పేర్కొంటున్నారు. జనరల్‌కు కేటాయించిన ఈ డివిజన్‌లో టీడీపీ కు బలమైన అభ్యర్థి దొరక్క అంతగా తెలియని వ్యక్తికి ఇక్కడ సీటు కేటాయించారు. సదరు అభ్యర్థి వైసీపీ కండువా కప్పుకొన్నారు. దీంతో ఆ డివిజన్‌ అధికార వైసీపీ ఖాతాలోకి వెళ్లింది.

గుంటూరు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో పోటీ చేసి విజయం సాధించి కార్పొరేటర్లుగా ఉన్నవారు చాలా మంది ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తాము పోటీ చేయడం లేదని ముందుగానే తెలియజేశారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న మాజీలను వేళ్లపై లెక్కించవచ్ఛు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లు తెదేపాకు కంచుకోటగా ఉంటాయి. 

ఆర్థిక, అంగబలం ఉన్న వారంతా ఆ నాలుగు డివిజన్లలోనే పోటీ చేయాలని భీష్మించుకుని కూర్చోవడంతో ఎంపిక ప్రక్రియ జిల్లా పార్టీ నేతలతో పాటు గుంటూరు పార్లమెంట్‌ పార్టీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమించింది. చివరకు వ్యవహారం తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆశావహులతో మాట్లాడి సర్దుబాట్లు చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పజెప్పారు. ఆయన రెండు రోజులు పాటు టీడీపీ నేతలతో పాటు కార్పొరేటర్‌ సీట్లు ఆశిస్తున్న వారితోనూ ముఖాముఖి మాట్లాడి సరిచేయాల్సి వచ్చింది. 

టీడీపీ బలంగా ఉన్న 35, 37, 42, 43 డివిజన్లలో పోటీ చేసేందుకు అందరూ ఆసక్తి కనబర్చారే తప్ప కొంచెం బలహీనంగా ఉన్న డివిజన్లపై దృష్టి పెట్టి అక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకు రాలేదని కార్యకర్తలు వాపోతున్నారు. 48వ డివిజన్‌ జనరల్‌కు కేటాయించారు. పై నాలుగు డివిజన్లలో పోటీ పడ్డ వారిలో ఎవరో ఒక్కరైనా ధైర్యం చేసి ఈ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఉంటే.. వైసీపీ కు ఏకగ్రీవమయ్యేది కాదని నాయకులతో పాటు కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా 21వ డివిజన్‌ను ఎస్టీ జనరల్‌కు కేటాయించగా.. అక్కడి నుంచి ఆ వర్గంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించలేకపోయారు. ఫలితంగా అక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థికి మద్దతు పలకాల్సిన పరిస్థితి దాపురించిందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. 29వ డివిజన్‌ బీసీ జనరల్‌కు కేటాయించగా మాజీ కార్పొరేటర్‌ నామినేషన్‌ వేశారు. సాంకేతిక కారణాలతో ఇక్కడ నామినేషన్‌కు అధికారులు పక్కన పెట్టారు. 

అభ్యర్థి ఈసీతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. 47వ డివిజన్‌ను జనరల్‌ మహిళకు కేటాయించగా ఇక్కడా బలమైన అభ్యర్థి పార్టీకి దొరకలేదు. బీ.ఫారంలో టీడీపీ అని రాయకపోవడంతో అధికారులు ధ్రువీకరించకుండా పక్కన పెట్టారు. సీటు కేటాయించిన మహిళ కనీసం ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేయకుండా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.

 గుంటూరు తూర్పులో 8, 15 డివిజన్లు సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 21, 29, ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని 47, 48 డివిజన్లు స్వయంకృతాపరాధం వల్ల చేజారిపోయాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్దుబాటు చేయడానికి నాయకులు నడుం బిగించాల్సిన అవసరం ఉంది.