తణుకు: మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు వై.టి రాజా అనారోగ్యంతో  మృతి చెందారు. కరోనా బారినపడ్డ ఆయన ఇటీవలే కోలుకున్నారు. అయితే మళ్లీ కాస్త అనారోగ్యంగా వుండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య మరింత క్షీణించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యేగా 1999 నుంచి 2004 వరకు పనిచేశారు రాజా. తణుకు కన్జ్యూమర్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 

పార్టీ నాయకులు వైటి రాజా మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ''తణుకు ప్రాంత అభివృద్దితో పాటు జిల్లా అభివృద్దికి వైటి రాజా పరితపించేవారు. శాసన సభ్యునిగా ఆయన చేసిన కృషి మరువలేనిది. వైటి రాజా మృతి పశ్చిమ గోదావరి జిల్లాకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను'' అంటూ చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఇక ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా రాజా మృతిపై సంతాపం ప్రకటించారు.  మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా గారి మరణం పార్టీకి తీరని లోటని... 
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు. 

''తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజాగారి మరణం పార్టీకి తీరణి లోటు. తణుకు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరనీయం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ పురోభివృద్ధికి చేసిన సేవలు అనిర్వచనీయం'' అన్నారు. 

''కరోనా నుండి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని అనుకున్న సమయంలో ఇలా అనారోగ్యంతో మరణించడం అత్యంత బాధాకరం.  రాజాగారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఎల్లవేళలా ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. రాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున భగవంతున్ని ప్రార్థిస్తున్నా'' అంటూ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.