అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా కొత్త పేరు తెర మీదికి వచ్చింది. సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తమ్మినేని సీతారాంను ఎపి అసంబ్లీ స్పీకర్ గా నిలబెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిర్ధారించారు.

తమ్మినేని సీతారాం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ విషయంపైనే సీతారాంతో జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కళింగ బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఆముదాలవలస నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 

స్పీకర్ పదవికి ఆనం రామనారాయణ రెడ్డి, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లను జగన్ పరిశీలించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, చివరకు తమ్మినేని సీతారాం పేరును ఖరారు చేయాలని జగన్ నిర్ణయించుకుని, ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశారు.

తమ్మినేని సీతారాంకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1985లో ఆయన ప్రభుత్వ విప్ గా పనిచేశారు. ఎన్టీఆర్ కొలువులో ఆయన 1994లో మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.