శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడి అరెస్టుపై చంద్రబాబు చేసిన విమర్శలకు, ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ గా తనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అచ్చెన్నాయుడి అరెస్టు విషయంలో ఏసీబి అధికారులు అన్ని నిబంధనలను పాటించారని ెచప్పారు. 

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని అన్ని ఆధారాలతోనే ఏసీబి అధికారులు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లు దోచుకున్నారని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడి నేరాలను అందరు బీసీలకు అంటగట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీసీలను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆయన అన్నారు. 

అచ్చెన్నాయుడు చేసిన తప్పులను బీసీలందరికీ ఆపాదిస్తున్నారని ఆయన అన్నారు. నేరాలకు, బీసీలకు లింక్ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. అక్రమ సంపాదనను మనీలాండరింగ్ ద్వారా దారి మళ్లించారని ఆయన అన్నారు. నేరం చేయకపోతే అచ్చెన్నాయుడు నిరూపించుకోవాలని ఆయన అన్నారు. ఈ నేరాన్ని అడ్డం పెట్టుకుని బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. 

బీసీలు నేరం చేస్తే వదిలేయాలా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉందని ఆయన అన్నారు.

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని గుంటూరు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను గుంటూరు ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. జైలు అధికారుల అనుమతితో ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

కోర్టు ఆదేశాలతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు. 

దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.