అమరావతి: తాగునీరు లేక చెన్నై వాసులు గతకొద్దిరోజులుగా అల్లాడిపోతున్నారని తమ గొంతు తడపాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరింది. 
తమిళనాడు 

ముఖ్యమంత్రి కె.పళని స్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రుల బృందం సీఎం జగన్ ను కలిశారు. తాగునీటితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని మంత్రుల బృందం జగన్ కు విజ్ఞప్తిచేసింది. 

తాగడానికి నీళ్లులేక 90లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం  దృష్టికి తీసుకు వచ్చారు. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని జగన్‌ ను కోరారు. తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు అందివ్వాలని అధికారులను ఆదేశించారు.  

ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలన్న జగన్ అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం తమపై ఉందన్నారు. 

అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశించారు. సీఎం జగన్ స్పందనపై తమిళనాడు మంత్రుల బృందం హర్షం వ్యక్తం చేసింది. చెన్నైకి తాగునీటి జలాలు అందిస్తున్నందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

చెన్నైలోని 90 లక్షల మంది ప్రజల ఆశీస్సులు సీఎం వైయస్‌.జగన్‌కు ఉంటాయని మంత్రుల బృందం స్్పష్టం చేసింది. తాము అడగగానే మానవత్వంతో జగన్ స్పందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

సీఎం జగన్ ను కలిసిన వారిలో తమిళనాడు మున్సిపల్‌శాఖమంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖమంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ లు ఉన్నారు. గత కొంతకాలంగా చెన్నై వాసులు తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.