మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు.
మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం ఉదయం తన అభిమానుల కోలాహలం మధ్య మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి రావటం ఖాయమని తేల్చేసారు. తన రాజకీయ ప్రవేశాన్ని కాలమే నిర్ణయించిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 234 సీట్లకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో సొంత పార్టీని ప్రకటిస్తానని కూడా చెప్పారు. ‘గెలుపోటమలు దేవుడి దయ..గెలిస్తే విజయం.ఓడితే మరణం’ అంటూ వేదాంతంతో కూడిన ఓ సెంటిమెంటు ప్రకటన చేసారు.

డబ్బు కోసమో, పేరు కోసమో తాను రాజకీయాల్లోకి రావాలనుకోవటం లేదన్నారు. అవి తనకు భగవంతుడు ఇప్పటికే ఇచ్చాడని తెలిపారు. దేశంలో రాజీయాలు భ్రష్టుపట్టిపోయాయని రజనీ ఆవేధన వ్యక్తం చేసారు. కొంతకాలంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజకీయాలు తనకు తీరని మనస్తాపానికి గురిచేసినట్లు ఆవేధన వ్యక్తం చేసారు. కొన్ని పార్టీలే తమిళ రాజకీయాలను భ్రష్టుపట్టించినట్లు మండిపడిన రజనీ ఆ పార్టీలేవో మాత్రం చెప్పలేదు.

ఇంత జరుగుతున్న తరువాత కూడా తాను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు అన్యాయం చేసినవాడిని అవుతాను రజనీ అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్దానికి తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. రజనీ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్ని అంటాయి. రజనీ అలా ప్రకటన చేశారో లేదో రాష్ట్రవ్యాప్తంగా వెంటనే బాణాసంచా పేలుళ్ళు మొదలైపోయాయి. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ అభిమాన సంఘాల వాళ్ళు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
