విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు  రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్  స్పందించారు.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్   సోమవారం నాడు విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తమతో పాటు ఏపీ ప్రజలు కూడ టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తలసాని చెప్పారు.చంద్రబాబునాయుడు ప్రచారానికే పరిమితమైన నేత అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకొన్నంత మాత్రానా వాస్తవాలను దాచలేమని తలసాని అభిప్రాయపడ్డారు. ఏపీలో కుల రాజకీయాలకు చంద్రబాబునాయుడే కారణమన్నారు.కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ కుల రాజకీయాలను చంద్రబాబునాయుడు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడ తాను చూసినట్టుగా  తలసాని చెప్పారు. ఏపీలో  ఏ పార్టీకి టీఆర్ఎస్ మద్దతిస్తామో మేం ఇంకా ప్రకటించలేదని తలసాని గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  మద్దతిస్తామని తలసాని స్పష్టం చేశారు.కేంద్రంపై అవిశ్వాసం విషయంలో చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడితే తాము ఎందుకు మద్దతివ్వాలని తలసాని ప్రశ్నించారు.వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని  కోరితే ఎందుకు టీడీపీ ఎంపీలు సహకరించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అడిగిన వారిని జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతోందన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో ఏపీ నుండి ఏ పార్టీ భాగస్వామ్యం కానుందో త్వరలోనే తేలనుందని  తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఏపీ ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు.చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత వార్త

బాబుతో వైరం, జగన్ తో దోస్తీ: తెరాసపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు