ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు,.. ప్రతి విమర్శలు ఉంటాయని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గుంటూరులో త్వరలో యాదవ, బీజ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతకముందు తాను రాజమండ్రి, ద్రాక్షారామం వెళ్లివచ్చినట్లు చెప్పారు.

తాను ఏపీకి వస్తే.. ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కి మాత్రం ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారని.. వాళ్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు. వాళ్లని ఎందుకు వచ్చారని కనీసం పోలీసులు అడగరని చెప్పారు. తనపై మాత్రం ఏపీలో ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు.

తాను బస చేస్తున్న హోటల్ యాజమాన్యాన్ని కూడా బెదిరించారని ఆరోపించారు. ఎపిలో ప్రభుత్వ పాలన దారుణంగా వుందన్నారు. ఎపిలో 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెబుతూ...మరో వైపు భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. పాడి పరిశ్రమ మీద నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు.కేంద్రం పాడి పరిశ్రమ అభివృద్ధి కి కౌంటర్ గ్యారంటీ అడిగితే ఎపి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.


చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఎలా లాభాల్లో వుందో పాడి రైతులకు కూడా వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో అభివృద్ధిలో రియాలిటీ వుందన్నారు. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ కెసిఆర్ ఇస్తున్నారని చెప్పారు. ఎపిలో రైతులు సరైన విధంగా కరెంటు ఇవ్వడం లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ ను కూడా ఎపి ప్రభుత్వం పక్కదోవ పట్టించిందన్నారు.  

కేంద్రం దీనిపై ఇంకా గైడ్ లైన్స్ ఇవ్వలేదు కానీ ఎపి ప్రభుత్వం కాపులను మోసం చేసేందుకు దీనిలో 5శాతం రిజర్వేషన్ కేటాయించినట్లు ప్రకటించిందన్నారు. పసుపు కుంకుమ బోగస్ పథకం అన్నారు. గతంలో ప్రకటించిన మాఫీ ఇప్పటి వరకు చెల్లించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ చెక్కుల హంగామా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోసం చంద్రబాబు పాట్లు  పడుతున్నారన్నారు. ఎపిని సింగపూర్ చేస్తానని అంటూ, అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 

హైదరాబాద్ ని నేనే కట్టినా అని చెప్పే చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను ఎందుకు కట్టలేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అని గతంలో చంద్రబాబు అనలేదా అని ప్రశ్నించారు. హోదాపై మాట్లాడితే  జైల్ లో పెడతానని బెదిరించలేదా అని నిలదీశారు. ఇప్పుడు కేంద్రం పై హోదా కోసం పోరాటం అంటున్నారన్నారు.  బిసిలని అన్ని విధాలుగా తొక్కేశారని ఆరోపించారు.  అందుకే యాదవులు, బిసిలు ఐక్యం కావాలని కోరుతున్నామన్నారు. 

చంద్రబాబు పెడుతున్న పప్పు బెల్లాలు ఎన్నికల వరకే పరిమితమని హితబోధ చేసే ప్రయత్నం  చేశారు.ఎపిలో అవినీతి అత్యధికంగా వుందన్నారు. ఇక్కడ ప్రతి డిపార్ట్‌మెంట్ లోనూ అవినీతి  ఉందన్నారు. చంద్రబాబు ఏం చెప్పినా నమ్మాలనే తరహాలో అధికారులు వున్నారన్నారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం ఏర్పాటు చేశారని..ఇప్పుడు అదే పార్టీని రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టారని మండిపడ్డారు.  

రాష్ట్రం లోని బిసిలను కదిలిస్తామన్నారు.  ప్రజాధనంతో చంద్రబాబు ధర్మదీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక ప్రభుత్వ విభాగంలో 37 మంది ఒకే సామాజిక వర్గం వారికే పదోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలను డబ్బుతో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. 
తెలంగాణలో కూడా రూ.500 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. 

తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ వారికి ఈ డబ్బు పంచారని చెప్పారు. ఎపి సమస్యలపై టిఆర్ఎస్ మద్దతు ఇస్తోందని చెప్పారు. పార్లమెంట్ లో కూడా తాము ఎపికి న్యాయం జరగాలని కోరామని చెప్పారు.