ఉన్నతాధికారి కదా అని... ఇంటికి వింధుకి పిలిచింది. గౌరప్రదంగా వచ్చి భోజనం చేసి వెళ్లాల్సింది పోయి మహిళా వీఆర్ఏ పట్ల ఆ ఉన్నతాధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్ఏ పై స్థానిక తహసీల్దార్ డీవీబి వర కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 25వ తేదీన వీఆర్ఏ క్రిస్మస్ పండగ సందర్భంగా కురిచేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకి పిలిచింది.

ఈ విందుకి సిబ్బంది అందరూ హాజరైనప్పటికీ... తహసీల్దార్ వరకుమార్ మాత్రం హాజరుకాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్ తన కార్యాలయంలో క్రిస్మస్ విందుకు తాను హాజరుకాలేని.. తనకు కోడి కూరతోపాటు.. నువ్వు కూడా కావాలంటూ అసభ్యంగా మాట్లాడాడు. తండ్రి వయసు వారు అలా మాట్లాడకూడదని ఆమె వారించినా అతను వినిపించుకోకపోవడం గమనార్హం.

AlsoRead ఎమ్మెల్యే రోజా వాహనంపై దాడి.. 30మందిపై కేసు...

ఆమెను వెనుక నుంచి కౌగిలించుకొని చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. బాధితురాల సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తహసీల్దార్ ని దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తహశీల్దార్ స్పందించారు. తనపై సదరు వీఆర్ఏ నిరాధార ఆరోపణలు చేస్తోందని.. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి దర్యాప్తు చేయాలని చెప్పారు.