ముఖ్యమంత్రి జగన్ తనను టార్గెట్ చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని పేర్కొన్నారు. 

జగన్ తనను టార్గెట్ చేస్తున్నారని... ఈ బస్సులతోనే బతకడం లేదని చెప్పారు. కేవలం బస్సులు నడపడం తనకు అలవాటు మాత్రమేనని చెప్పారు. ఎవరు ఎలా బతిదకారో తనకు బాగా తెలుసునని... ఎవరి చరిత్ర ఏంటో కూడా తనకు తెలుసని చెప్పారు. 40ఏళ్ల క్రితం నుంచే తాను కారులో తిరిగానని చెప్పారు.

ఇప్పుడు కూడా మీకన్నా మంచి కార్లలలోనే తిరుగుతున్నానని చెప్పారు. తన బస్సులను సీజ్ చేయడం పై కూడా జేసీ స్పందించారు. ‘బస్సులు సీజ్‌ చేస్తున్నారు.. ఇంతకన్నా ఏం చేస్తారు.. ఒకవేళ కేసులు పెడతారు.. జైలులో పెట్టిస్తారు.. ప్రభాకర్‌రెడ్డికి ఏమైనా ఫర్వాలేదు.. ఎవరికీ నష్టం రాదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను పట్టించుకోండి. నేనైతే వదలను.. కోర్టు ఉంది. న్యాయపరంగా పోరాటం చేస్తా. ఎన్ని రకాలుగా బెదిరించినా భయపడేది లేదు.. పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని స్పష్టం చేశారు.
 
‘20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని బస్సు సీజ్‌ చేశారు... ఏదో లారీనో... గాడిదో అడ్డం వచ్చింటుంది... అంతమాత్రం తెలియదేమయ్యా... బస్సులు తిరగకుండా చేస్తే అవసరమైతే గుజిరీకి అమ్ముకుంటా. మమ్మలను టార్గెట్‌ చేయడం కాదు... మీరేమి చేశారో మాకు తెలుసు... మీ మనస్సాక్షికి తెలుసు. ఎవరో గుంటూరోడు పార్టీ నుంచి పోయాడు... అక్కడ గనులు ఆపారు.. భయపడిపోయాడు. మేం కాంగ్రెస్‌ నుంచే బతికాం... ఆ రోజు ఆ పార్టీని వదిలివచ్చేందుకు బాధపడ్డాం. ఈ రోజు మళ్లీ టీడీపీని వదిలివెళ్లలేం. నేనేమీ 16 నెలలు జైలుకెళ్లలేదు. మా నాన్న స్వాతంత్య్రసమరయోధుడు... దేశం, ప్రజల కోసం పోరాడి జైలుకెళ్లారు’ అని చెప్పుకొచ్చారు.