న్యూఢిల్లీ: విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. డాక్టర్ రమేష్ బాబు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై పోలీసుల విచారణను ఆపేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఊర టలభించింది.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ సాగించాలని ఆదేశించింది. డాక్టర్ రమేష్ బాబు కూడా విచారణకు సహకరించాలని సూచించింది.  

హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై దర్యాప్తును నిలిపేయాలని అనడం సరి కాదని అభిప్రాయపడింది. 

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహించిన రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి. రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డి. రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

అగ్నిప్రమాదం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదే హోటల్లో అంతకు ముందు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహించిన నేథ్యంలో స్వర్ణ ప్యాలెస్ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు సబ్ కలెక్టర్ ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. 

ప్రమాద ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ జస్టిస్ డి. రమేష్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.