సేవ్ అమరావతి: పెళ్లి పత్రికపై సురేష్ వినూత్న ప్రచారం
సేవ్ అమరావతి పేరుతో నినాదాలను ముద్రించి సురేష్ అనే వ్యక్తి తన పెళ్లి కార్డుపై ముద్రించి పంచుతున్నాడు.
విజయవాడ: అమరావతిని రక్షించండి.. రైతులను కాపాడండి అనే నినాదంతో కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన జాస్తి సురేష్ తన పెళ్లి పత్రికను వినూత్నంగా తయారు చేయించారు.
కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన జాస్తి సురేష్ వివాహం సందర్భంగా పెళ్లి పత్రికల్లో అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. సురేష్ నిశ్చితార్థం గత వారంలో జరిగింది.
నిశ్చితార్థం కోసం వచ్చిన కొందరు బంధువులు భోజనం చేయకుండానే వెళ్లిపోయారు. అమరావతి ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉన్నందునే భోజనం చేయకుండానే వెళ్లడంతో సురేష్ వినూత్నంగా ఆలోచించాడు.
అమరావతి విషయమై తనకు తోచిన రీతిలో ప్రచారం చేయాలని భావించాడు. తన పెళ్లి పత్రికపై సేవ్ అమరావతి, సేవ్ ఫార్మర్స్ అనే నినాదాలను ముద్రించాడు.
ఈ పెళ్లి పత్రికలను బంధువులు, స్నేహితులకు పంచుతున్నాడు. తన పెళ్లిని పురస్కరించుకొని అమరావతి ప్రాంత రైతుల ఇబ్బందులను ఈ రకంగా ప్రస్తావించాలని భావించినట్టుగా సురేష్ చెబుతున్నాడు.
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దాదాపుగా 45 రోజులకు పైగా ఈ ప్రాంత రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తొలి తరం తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి కూడ తన పెళ్లి పత్రికపై జై తెలంగాణ అంటూ ముద్రించి పంచారు. మలి విడత ఉద్యమంలో కొందరు ఇదే తరహా ప్రచారాన్ని నిర్వహించారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో అమరావతి రైతులకు మద్దతుగా సురేష్ తన పెళ్లి పత్రికలపై నినాదాలు ముద్రించి పంచడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.