ఇంకో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు జరగాల్సుంది.

రాష్ట్ర విభజనకు సంబంధించి సుప్రింకోర్టు తీరు ‘అయి పోయిన పెళ్ళికి భాజాలు’ లాగుంది. ఎందుకంటే, రాష్ట్ర విభజన జరిగిపోయి దాదాపు నాలుగేళ్ళయిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇంకో ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు జరగాల్సుంది. ఇటువంటి సమయంలో రాష్ట్ర విభజన జరిగిన విధానం, విభజన చట్టం హామీలపై సుప్రింకోర్టు విచారణ చేయటమంటే విచిత్రంగానే ఉంది.

రాష్ట్ర విభజన హడావుడిగా, అడ్డుగోలుగా జరిగిందన్న విషయం మొత్తం దేశానికంతా తెలిసిందే. ఇపుడు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన జరగకముందే కేసు వేసినపుడు కోర్టు స్పందిచలేదు. తర్వాత తీరిగ్గా రెండు తెలుగురాష్ట్రాలతో పాటు కేంద్రానికి సుప్రింకోర్టు నోటీసులు ఇవ్వటంలో అర్ధమేలేదు.

విభజన జరిగిన ఇంతకాలానికి కోర్టులో విచారణ జరిపి సుప్రింకోర్టు ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. విభజన జరిగిన తీరు అడ్డదిడ్డంగానే జరిగిందని కోర్టు తీర్పు చెప్పినా మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుస్తాయా? సందేహమే. లేదూ విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనంటూ కోర్టు కేంద్రాన్ని ఆదేశించ గలదా?

విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రమే మూడున్నరేళ్ళుగా వాయిదాలకు హాజరుకాకపోయినా కోర్టు ఏమీ చేయలేకపోయింది. వాయిదాలకే కేంద్రాన్ని రప్పించలేకపోయిన కోర్టు ఇక విభజన చట్టం అమలు తదితరాలపై ఏమి మాట్లాడగలుగుతుంది?