అమరరాజా బ్యాటరీస్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరరాజాపై ఎలాంటి బలవంతపు చర్యలు దిగొద్దని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 

టీడీపీ నేత (tdp) , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కి (galla jayadev) ఊరట లభించింది. ఆయన కుటుంబం ఆధ్వ‌ర్యంలో నడుస్తోన్న అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌ల‌కు దిగ‌రాద‌ని సుప్రీంకోర్టు (supreme court) ఏపీ ప్ర‌భుత్వాన్ని (ap govt) ఆదేశించింది. అంతేకాకుండా అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌కు (amara raja battery) కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (ap pollution control board) జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల‌పైనా స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

కాగా.. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌లో కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సూచించిన ప్ర‌మాణాలు లేవంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (పీసీబీ) ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో పీసీబీ నోటీసుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం ముందుకు వెళ్ల‌వ‌చ్చ‌ని ఏపీ హైకోర్టు సైతం సమర్థించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ అమ‌రరాజా బ్యాట‌రీస్‌ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై గురువారం విచార‌ణ జ‌ర‌గ‌గా.. ఆ సంస్థ‌పై బ‌లవంత‌పు చ‌ర్య‌లు వ‌ద్దంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవ‌హారంలో ఏపీ ప్ర‌భుత్వం, పీసీబీ, ప్ర‌ధాన విద్యుత్ పంపిణీ సంస్థ‌ల‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం అమరరాజా సంస్థకు చెందిన కరకంబాడి భూముల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ భూములపై యథాతథస్థితి కొనసాగించాలని.. అలాగే ఆ కంపెనీపై ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడొద్దని కోర్టు సూచనలు చేసింది. అమరరాజా సంస్థకు గతంలో ప్రభుత్వం కరకంబాడిలో భూములను కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జగన్ ప్రభుత్వం భావించింది. కంపెనీకి అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీనిపై అమరరాజా ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.