Asianet News TeluguAsianet News Telugu

రఘురామ కాలి ఎముక విరిగింది: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక సంచలనం

రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. నివేదికు సుప్రీంకోర్టు చదివి వినిపించింది. రఘురామకు గాయాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.

Supreme Court reveals Secendurabad Army hospital report on Raghuarama Krishnama raju
Author
New Delhi, First Published May 21, 2021, 1:16 PM IST

న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడినట్లు ఆర్తమవుతోంది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు తెలిపింది. రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రఘురామ కాలి వేలికి ఫ్రాక్చర్ ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

తమకు ఎవరైనా ఒక్కటేనని సుప్రీంకోర్టు తెలిపింది రఘురామ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో తెలియదని సిఐడి వాదించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందలేదని సిఐడి తెలిపింది. దీంతో ఆర్మీ ఆస్పత్రి నివేదికను సిఐడికి, పిటిషనర్లకు మెయిల్ చేస్తామని తెలిపింది. 

రఘురామ కృష్ణమ రాజు కాలి ఎముక విరిగిందని, ఇతర గాయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. సిఐడి కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును కొట్టారనేది వాస్తవమని తేలినట్లు రఘురామ తరఫు న్యాయవాది అన్నారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు.  రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని సిఐడి కోరింది. దానికి అభ్యంతరం తెలుపుతూ, ఈ రోజు విచారణ పూర్తి చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు.  రఘురామకు బెయిల్ మంజూరు చేయానలని కోరారు. విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది.

ఇదిలావుంటే, తనకు బెయిల్ ఇవ్వాలంటూ రఘురామ కృష్ణమ రాజు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన దాఖలు చేశారు. రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.  

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ముగ్గురు వైద్యుల బృందం తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షణలో ఆ పరీక్షలు జరిగాయి. తమ నివేదికను వైద్యులు సీల్డ్ కవర్ లో అందించారు. ఆ సీల్డ్ కవర్ ను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపించింది.

సిఐడి కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారని, తనను కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను తమకు అందించాలని కింది కోర్టు ఇదివరకు ఆదేశించారు.

గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించిన సిఐడి అధికారులు రమేష్ ఆస్పత్రికి తరలించలేదు. రఘురామ కృష్ణమ రాజును ఎవరూ కొట్టలేదని జీజీహెచ్ వైద్య బృందం నివేదిక తేల్చింది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు ఎక్కింది. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలనే రఘురామ కృష్ణమ రాజు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్థనను సిఐడి తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వ్యతిరేకించారు. దీంతో సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దాంతో గుంటూరు జిల్లా జైలు నుంచి రఘురామ కృష్ణమ రాజును సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే, రఘురామ కృష్ణమ రాజుకు బెయిల్ ఇవ్వకూడదని సిఐడి కౌంటర్ దాఖలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios