లింగమనేనికి సుప్రీంలో చుక్కెదురు:రుషికొండపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

రుషికొండ పై దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు  అసహనం వ్యక్తం చేసింది.  రాజకీయాలకు ఇది వేదిక కాదని  తేల్చి చెప్పింది. 

supreme Court  Rejects  Lingamaneni  Sivarama Prasad petition on Rushikonda lns

అమరావతి: విశాఖ రుషికొండ కేసులో జోక్యం చేసుకోలేమని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.లింగమనేని శివరామ ప్రసాద్  దాఖలు చేసిన  పిటిషన్ ను  సుప్రీంకోర్టు  తిరస్కరించింది. రుషికొండలో  సీఎం క్యాంప్ కార్యాలయం, అక్రమ నిర్మాణాలపై  లింగమనేని శివరామప్రసాద్  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఎ కింద ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని శివరామప్రసాద్ ఆ పిటిషన్ లో కోరారు. రుషికొండపై  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,  ఏపీ హైకోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యే వరకు  ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్ లో శివరామప్రసాద్ కోరారు.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు విచారణ నిర్వహించింది. పిటిషన్ పై  సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాలకు ఇది వేదిక కాదని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను  వైఎస్ జగన్ సర్కార్ ప్రకటించింది.విశాఖపట్టణంలో అందుబాటులో ఉన్న భవనాలను  ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగించుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్టణం నుండి పాలనను ప్రారంభించాలని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే అధికారులు చర్యలు చేపట్టారు.  అయితే  రుషికొండలో నిర్మాణాల విషయంలో  విపక్షాలు జగన్ సర్కార్  పై విమర్శలు గుప్పించారు.  రుషికొండను  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పరిశీలించారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ కూడ  పరిశీలించిన  విషయం తెలిసిందే .  రుషికొండలో  నిర్మాణాలపై లింగమనేని  శివరామప్రసాద్ పిటిషన్ ను దాఖలు చేశారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత  చంద్రబాబు సర్కార్ అమరావతిలో రాష్ట్ర రాజధాని కోసం శంకుస్థాపన చేశారు. అయితే  జగన్ సర్కార్  మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ నిర్ణయాన్ని విపక్షాలు విమర్శించాయి.  ఒక్క రాజధాని ఉండాలని ఆందోళన నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై  మరోసారి విచారణ నిర్వహించాలని కేంద్ర పర్యావరణ శాఖను  ఏపీ హైకోర్టు  ఈ ఏడాది అక్టోబర్ 31న ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల  28న విచారణ నిర్వహించనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది. రుషికొండలో 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులిస్తే  20 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారని  దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios