Asianet News TeluguAsianet News Telugu

రఘురామకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు: సుప్రీంకోర్టు ఆదేశం

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Supreme Court orders to conduct medical tests at Secendurabad Army hospital
Author
New Delhi, First Published May 17, 2021, 2:12 PM IST

న్యూఢిల్లీ: వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి పంపించాలని ఆదేశించింది. ఈ విషయంపై దాదాపు మూడు గంటల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

రఘురామరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తెలంగా హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు చేయించే బాధ్యతను తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రఘురామ కృష్ణమ రాజు ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నంత వరకు తోడుగా జ్యుడిషియల్ అధికారి ఉంటారని చెప్పింది. 

రఘురామకు నిర్వహించే వైద్య పరీక్షల వీడియోగ్రఫీని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో తమకు ఇవ్వాలని సూచించింది.వైద్య పరీక్షల ఖర్చను రఘురామ కృష్ణమ రాజే భరించాలని సూచించింది. 

కాగా, రఘురామరాజు బెయిల్ పిటిషన్ మీద విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ విషయంపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది. రఘురామ కృష్ణమ రాజు, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసి స్పెషల్ లీవ్ పీటిషన్లపై కౌంటర్ దాఖలుకు సిఐడి వచ్చే బుధవారం వరకు సమయం అడిగింది.

ఇదిలావుంటే, రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులు విచారణ జరిగింది.. విచారణను 79 మంది వింటున్నారని అంటూ వారంతా ఎవరు, రిజిస్ట్రీ ఎందుకు అనుమతించారని సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అడిగారు. ఇప్పుడు 70 మంది ఉన్నారని, అది 67కు తగ్గిందని జస్టిస్ శరన్ చెప్పారు. 

రఘురామ కృష్ణమ రాజుకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడానికి అభ్యంతరాలు ఉండవచ్చునని, అప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించవచ్చునని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు తమకు అభ్యంతరాలున్నాయని, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలిలో ఇద్దరు వైసీపీ ఎంపీలున్నారని ఆయన చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత బెయిల్ పిటిషన్ మీద నిర్ణయం జరిగే వరకు రఘురామను హౌస్ అరెస్టులో ఉంచాలని రోహత్గి కోరారు. 

అయితే, రఘురామకు వైద్య పరీక్షలు చేయించడానికి మణిపాల్ ఆస్పత్రి ఉందని, అది విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని సిఐడి తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ స్థితిలో వైద్య పరీక్షలపై కేసును సుప్రీంకోర్టు ఒంటి గంటకు వాయిదా వేసింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విచారణకు హాజరయ్యారు.

కాగా, అంతకు ముందు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రుఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ వాదనలు వినిపిస్తున్నారు. ఏపి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపిస్తున్నారు. 

రఘురామకు బెయిల్ ఇవ్వడంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. రఘురామను అరెస్టు చేసిన తీరును ఆయన సుప్రీంకోర్టుకు వినిపించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారుుల పట్టించుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. 

బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్ 124(ఏ) కిద కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డిజీ స్వయంగా విచారణకు ఆదేశించారని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెపపారు. గుంటూరు తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతోనే అక్కడ కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. 

కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును కొట్టారని, అరికాళ్లకు తగిలిన దెబ్బలను రఘురామ మెజిస్ట్రేట్ కు చూపించారని ఆయన గుర్తు చేశారు. గత ఎడాది డిసెంబర్ లో రఘురామకృష్ణమ రాజుకు బైపాస్ సర్జరీ జరిగింది ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామ కృష్ణమ రాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆయన కోరారు. 

రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలనే రోహత్గీ వాదనలకు దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు.  మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో జ్యుడిషియల్ అధికారి సమక్షంలో పరీక్షలు చేయిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్మీ ఆస్పత్రులున్నాయా అని జస్టిస్ శరన్ అడిగారు. సికింద్రాబాదులో ఉందని రఘురామ తరపు న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పారు. అక్కడి నుంచే రఘురామను అరెస్టు చేసి గుంటూరు తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో నేవల్ బేస్ ఆస్పత్రి ఉందని, అది కూడా 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios