Kolleru Encroachments: కొల్లేరు ఆక్రమణలు, ప్రస్తుతం అక్కడి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ చేయాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

కొల్లేరులో గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా ఆక్రమణల పరంపర కొనసాగుతుంది. సరస్సును పూర్తిగా ఆక్రమించి చేపల చెరువులను నిర్మించుకున్నారు. వాస్తవానికి కొల్లేరు పరిధిలో 1.80 లక్షల ఎకరాలు ఉండగా.. దాదాపు 90 శాతం ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించారు. వందల ఎకరాలను ఆక్రమించుకుని చేపలు, రొయ్యల వ్యాపారం సాగిస్తున్నారు. ఇందులో వందల ఎకరాల్లో రాజకీయ నాయకుల చెరువులు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల కొల్లేరు విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆక్రమణలు ఏమేరకు జరిగిందో సమగ్రంగా విచారించి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తాజా మరోసారి ఎంత వరకు పనులు పూర్తి చేశారు.. వివరాల నమోదు ఏవిధంగా చేస్తున్నారు అన్న విషయాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. 

కొల్లేరులో ప్రైవేటు భూములను గుర్తించి నమోదు చేస్తుండటంతో ప్రైవేటు మత్స్యకారులు సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది విచారణలో ఉన్న క్రమంలో ఇప్పటి వరకు కొల్లేరులో ఎలాంటి సమాచారం సేకరించారు. ఎన్ని వేల ఎకరాల్లో భూమి ఆక్రమణలకు గురైంది, అధికారులు ఏవిధంగా సర్వే చేశారు.. అందులో వాస్తవం ఎంత ఉంది అన్న వివరాలను తెలియజేయాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కోర్టు ఆదేశించింది. 

ఇక కొల్లేరు సరిహద్దులను గుర్తించేందుకు ఆర్ సుకుమార్ కమిటీని ఏర్పాటు చేయగా.. వారు నివేదికను కూడా అందజేశారు. ఆ వివరాలను సైతం మరోసారి పరిశీలించాలని నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కొల్లేరులో వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. కొల్లేరులో ఉన్న ప్రైవేటు భూ యజమానులకు ఏవిధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు తదితర అంశాలపై నివేదికను 12 వారాల్లో అందజేయాలని కోరింది. 

కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన చేయాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలో మళ్లీ కొల్లేరు సరిహద్దులను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారు వెరిఫై చేయనున్నారు.