Asianet News TeluguAsianet News Telugu

వివేకానందరెడ్డి హత్య కేసు‌: సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ.. సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

వివేకానందరెడ్డి హత్య కేసులో  దర్యాప్తు జరుగుతున్న తీరుపై  ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

Supreme Court On Sunitha Reddy Plea over her father YS Vivekananda Reddy death case probe
Author
First Published Sep 19, 2022, 2:02 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో  దర్యాప్తు జరుగుతున్న తీరుపై  ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని సునీతా రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై నేడు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సునీతా రెడ్డి తరఫు న్యాయవాది.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. నిందితులుగా ఉన్నవారు బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసు విచారణలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే స్పందించిన ధర్మాసనం.. సునీతా రెడ్డి లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 14కి వాయిదా వేసింది. 

ఇక, వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ గత రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టి గంగిరెడ్డి, జి ఉమా శంకర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వై సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. అయితే ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి సీబీఐ ఇంకా విచారణ కొనసాగుతోంది.

అయితే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని, చాలా సమయం తీసుకుంటోందని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేస్తున్నారని, అధికారులు ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కేసును బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios