ఆస్తుల పంపకాలపై ఏపీ పిటిషన్‌పై విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం..
రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆస్తుల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆస్తుల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ఏపీ ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. అయితే ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగగా.. తెలంగాణ, కేంద్రం తరఫున న్యాయవాదులు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో కౌంటర్‌పై రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఇక, ఏపీ సర్కార్ తన పిటిషన్‌లో.. షెడ్యూల్ 9, 10 ల అంశాలు పరిష్కారం కాకపోవడంతో ఏపీ నష్టపోతుందని పేర్కొంది. విభజన అంశాల పరిష్కారంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆస్తులలో 91 శాతం హైదరాబాద్‌లో ఉన్నందున ఆస్తుల విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్దంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.