మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గంగిరెడ్డి ఈ కేసులో కొందరు సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించింది.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేషన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం ధర్మాసనంనోటీసులు జారీ చేసింది. సీబీఐ వాదనలపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇక, ఈ కేసులో గంగిరెడ్డికి కింది కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. గంగిరెడ్డి సహా రాజకీయంగా బలమైన వ్యక్తులు సాక్షులను బెదిరిస్తున్నారని, వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది. గంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న జె శంకరయ్యతో పాటు మరో ఇద్దరు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చేందుకు తొలుత అంగీకరించారని.. అయితే ఆ తర్వాత విరోధంగా మారారని సీబీఐ వాదించింది.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి హత్యకు పాల్పడిన వారు తనను బెదిరించారని పేర్కొన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇతర నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున, గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నందున అతనికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నాడని చూపించేందుకు సీబీఐ ఎలాంటి వివరాలు ఇవ్వలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసులో కీలక సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నాడని, ప్రభావితం చేశాడని చెప్పేందుకు సీబీఐ తగిన సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైందని హైకోర్టు పేర్కొంది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది మార్చిలో హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో గంగిరెడ్డికి బెయిల్‌ను రద్దు చేయాలన్న తమ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
