Asianet News TeluguAsianet News Telugu

సస్పెన్స్‌కు తెర.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌  బుధవారం రోజున విచారణకు రానుంది.

Supreme court likely to hear chandrababu Naidu SLP tomorrow on quash skill scam case ksm
Author
First Published Sep 26, 2023, 11:23 AM IST

సుప్రీం కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ విషయంలో క్లారిటీ వచ్చింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌  బుధవారం రోజున విచారణకు రానుంది. చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అయితే చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు పిటిషన్‌ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో ఈరోజు సాయంత్రం వెల్లడి కానుంది. 

అయితే నేడు సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్  పిటీషన్‌పై స్పెషల్ బెంచ్ సమావేశమైంది. స్పెషల్ బెంచ్ సమావేశం నేతృత్వంలో  నేడు ప్రస్తావనలను సీజేఐ అనుమతించలేదు. దీంతో చంద్రబాబు పిటిషన్‌‌పై విచారణ ఎప్పుడూ జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.అయితే చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఎల్లుండి(సెప్టెంబర్ 28) నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీం కోర్టుకు సెలవులు ఉండటంతో.. చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది?, వచ్చే వారానికి వాయిదా వేస్తుందా? అనే చర్చ కూడా సాగుతుంది. 

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. ఇక, ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వాన్ని, అజేయ్ కల్లాంను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

అయితే ఈ పిటిషన్‌ను చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్రా సోమవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ముందు ప్రస్తావించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని.. అక్కడ ప్రతిపక్షాలు అణచివేయబడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన సిద్దార్థ లూత్రా..  ఈ నెల 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. మంగళవారం మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అప్పుడు ఏం చేయాలనేది చూస్తామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios