రాత్రి తర్వాత తెల్లారుతుంది... చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ వైరల్
చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది.. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది’’ అని పేర్కొన్నారు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది.. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది’’ అని పేర్కొన్నారు. చంద్రబాబు క్వాష్, కస్టడీ పిటిషన్‌లలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో లూథ్రా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ సిద్థార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘‘అన్ని విధాలుగా ప్రయత్నించినా.. న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు, కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది ’’ అంటూ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ సూక్తులను లూథ్రా షేర్ చేశారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడుకు శుక్రవారం వరుస షాకులు తగిలాయి. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనను 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతించింది. అంతకుముందు ఉదయం చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్ట్ మరో రెండు రోజులు పొడిగించింది. అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్ట్ పేర్కొంది.
ALso Read: చంద్రబాబుకు షాక్: రెండు రోజులు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి
చంద్రబాబును సీఐడీ విచారించే సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు కూడా అనుమతిని ఏసీబీ కోర్టు ఇచ్చింది.ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటలలోపుగానే చంద్రబాబును ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరో వైపు విచారణ సమయంలో తీసిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.విచారణ జరిపే అధికారుల పేర్లను కూడ ఇవ్వాలని న్యాయమూర్తి సీఐడీని కోరారు.
మరోవైపు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. అయితే కస్టడీ పిటిషన్ పై విచారణ సమయంలో బెయిల్ పిటిషన్ పై వాదనలు వినపడం సరైంది కాదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.ఈ పిటిషన్ పై రేపు వాదనలను విన్పిస్తామని చంద్రబాబు న్యాయవాదులు చెప్పారు. అయితే రేపు వాదనలను వినడానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో సోమవారంనాడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగే అవకాశం ఉంది.