చంద్రబాబుకు షాక్: రెండు రోజులు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది. రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే చంద్రబాబును ఎక్కడ విచారిస్తారని ఏసీబీ న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించింది. జైల్లో విచారిస్తారా, తటస్థ ప్రదేశంలో విచారిస్తారా అని జడ్జి ప్రశ్నించారు. సీఐడీ అధికారుల సమాధానం ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని జడ్జి చెప్పారు. అయితే జైల్లోనే విచారిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సీఐడీ తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. రేపు, ఎల్లుండి చంద్రబాబును రాజమండ్రి జైల్లో చంద్రబాబును విచారించే అవకాశం ఉంది.విచారణ నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తైన తర్వాత వర్చువల్ గా చంద్రబాబును కోర్టు ముందు హాజరు పర్చాలని ఏసీబీ కోర్టు కోరింది.
విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు కూడ అనుమతిని ఏసీబీ కోర్టు ఇచ్చింది.ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటలలోపుగానే చంద్రబాబును ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరో వైపు విచారణ సమయంలో తీసిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.విచారణ జరిపే అధికారుల పేర్లను కూడ ఇవ్వాలని న్యాయమూర్తి సీఐడీని కోరారు. మరో వైపు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. అయితే కస్టడీ పిటిషన్ పై విచారణ సమయంలో బెయిల్ పిటిషన్ పై వాదనలు వినపడం సరైంది కాదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.ఈ పిటిషన్ పై రేపు వాదనలను విన్పిస్తామని చంద్రబాబు న్యాయవాదులు చెప్పారు. అయితే రేపు వాదనలను వినడానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో సోమవారంనాడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగే అవకాశం ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు శుక్రవారంనాడు తీర్పును వెల్లడించింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ అధికారులు ఈ నెల 11న కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే ఈ నెల 10వ తేదీన కస్టడీని కోరకుండా 11 వ తేదీన మెమో ద్వారా కస్టడీని అడగడంపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో ఎఫ్ఐఆర్ ను, రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం తీర్పును వెల్లడించింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని ఏసీబీ కోర్టును ఏపీ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
also read:చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత: సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ
ఈ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ వరకు ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 19వ తేదీన సీఐడీ కస్టడీకి చంద్రబాబును తీసుకోవాలనే పిటిషన్ పై విచారణ నిర్వహించారు. ఇరు వర్గాల వాదనలను విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 21న ఉదయం ఈ విషయమై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. అయితే అదే రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఈ విషయమై కస్టడీ పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది.
అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే కస్టడీ పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 01:30 గంటలకు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కి ఏఏజీ తీసుకు వచ్చారు. దీంతో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీ పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడయ్యాక ఏసీబీ కోర్టు తన తీర్పును వెల్లడించింది. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిని ఇచ్చింది.