రాజమండ్రి సెంట్రల్ జైలుకు సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబుతో భేటీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కలిశారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కలిశారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన జైలు రిసెప్షన్‌లో తన వివరాలు నమోదు చేసి లోపలికి వెళ్లారు. చంద్రబాబుతో భేటీ తర్వాత సిద్ధార్ధ్ లూథ్రా మీడియాతో మాట్లాడే అవకాశం వుంది.
అంతకుముందు ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే, ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంత వరకు పోరాడటమే మార్గం అంటూ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ సూక్తులను పంచుకున్నారు.
Also Read: న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు.. : చంద్రబాబు లాయర్ లూథ్రా ఆసక్తికర పోస్టు..
ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం ఉదయం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేశానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తానని చంద్రబాబు లాయర్‌ను ప్రశ్నించారు. అయితే ఇందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఈ నెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది