సారాంశం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున కోర్టులో సుప్రీం కోర్టు న్యాయవాది సిదార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి  తెలిసిందే.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున కోర్టులో సుప్రీం కోర్టు న్యాయవాది సిదార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి  తెలిసిందే. అయితే సిదార్థ లూథ్రా ఈరోజు ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా చేసిన ఒక పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురుగోవింద్ సింగ్ ఔరంగజేబుకు రాసిన జఫర్నామాలోని ఒక సూక్తిని సిదార్థ లూథ్రా షేర్ చేశారు. ఈరోజు నినాదం ఇదేనని పేర్కొన్నారు. 

ఇంతకీ అందులో ఏముందంటే.. ‘‘అన్నీ రకాలుగా ప్రయత్నించినప్పుడు, ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు.. అప్పుడు కత్తి తీయడం సరైనది. అప్పుడు పోరాడటం సరైనది’’ అని సిదార్థ లూథ్రా పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్.. న్యాయవాదికి అతని కలం కత్తి కంటే శక్తివంతమైనది కావచ్చని పేర్కొన్నారు. దీనికి బదులిచ్చిన సిద్దార్థ లూథ్రా ‘‘లాయర్ల కత్తి అంటే చట్టం సార్’’ అని పేర్కొన్నారు. 

 

ఇదిలా ఉంటే, ఈరోజు సాయంత్రం సిదార్థ లూథ్రా రాజమండ్రి సెంట్రల్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి వివరాలు, న్యాయపరమైన అంశాలు, కోర్టులో జరుగుతున్న పరిణామాలతో పాటు.. ఇతర కేసులకు సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నట్టుగా  తెలుస్తోంది. 

 

ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం ఉదయం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేశానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తానని చంద్రబాబు లాయర్‌‌ను ప్రశ్నించారు. అయితే ఇందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 

మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 19కి  వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా  వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఈ నెల 18 వరకు ఎలాంటి  విచారణ చేపట్టవద్దని విజయవాడ  ఏసీబీ  కోర్టును ఆదేశించింది.