న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో ఎల్జీ పాలీమర్స్ కు షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎల్జీ పాలీమర్స్ ను వెంటనే మూసివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎల్జీ పాలీమర్స్ ను వెంటనే మూసివేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎల్జీ పాలీమర్స్ ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ప్లాంట్ లో ఉన్న పరిస్థితులు. అత్యవసర పరిస్థితుల కారణంగా తాము ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలీమర్స్ ప్రతినిధులు సుప్రీంకోర్టును కోరారు. ఈ విషయమై హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లు దర్యాప్తు చేస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ సమయంలో తాము హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

also read:ఎల్జీ కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు సరెండర్: ఎల్జీ ప్రమాదంపై హైకోర్టులో విచారణ

ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీకైంది.  ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మరణించిన వారితో పాటు అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది.

ఎల్జీ పాలీమర్స్  ఘటనపై ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసి వేయాలని ఈ నెల 24వ తేదీన హైకోర్టు ఆదేశించింది.