Asianet News TeluguAsianet News Telugu

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంలో ఊరట.. మహారాష్ట్ర పిటిషన్ తిరస్కరణ

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టుపై స్టే విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే.. బాంబే హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉన్నదని పేర్కొంటూ మహారాష్ట్ర విజ్ఞప్తిని తిరస్కరించింది.
 

supreme court declines maharashtra petition of put stay on professor gn saibaba acquittal kms
Author
First Published Mar 11, 2024, 7:47 PM IST

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఈ రోజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. సుప్రీంకోర్టు మహారాష్ట్ర పిటిషన్‌ను తిరస్కరించింది. బాంబే హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉన్నదని స్పష్టం చేసింది.

నిర్దోషులుగా వారు ఊరికే, సులువుగా బయటపడలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారో కదా.. అని వివరించింది. ఈ కేసులో వారు నిర్దోషులని రెండు సార్లు తీర్పులు వచ్చాయని గుర్తు చేసింది. హైకోర్టులోని రెండు భిన్నమైన ధర్మాసనాలు వారిని నిర్దోషులుగా తేల్చాయని వివరించింది. ప్రాథమికంగా వారి తీర్పు హేతుబద్ధంగా ఉన్నదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహెతా అన్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో ఉన్నారన్న అభియోగాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన సహ నిందితులను నిర్దోషులుగా రెండు సార్లు హైకోర్టు ధర్మాసనాలు తేల్చాయి. 2022 అక్టోబర్‌లో తొలిసారి వీరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ నెల 5వ తేదీన కూడా మరో ధర్మాసనం వీరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, నిందితులపై అభియోగాలను ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా నిరూపించలేకపోయిందని స్పష్టం చేసింది.

Also Read: CAA: నేటి నుంచి అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫై చేసిన కేంద్రం

సాయిబాబా, ఇతర నిందితులపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిందని మహారాష్ట్ర తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనలర్ ఎస్‌వీ రాజు సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కానీ, ధర్మాసనం మాత్రం ఆయన వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును తాము పరిశీలించామని, ఆ తీర్పు సహేతుకంగా ఉన్నదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios