అమరావతి:  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు అమరావతిలో ప్రారంభించారు.మరో వైపు  ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులను కూడ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ప్రారంభించారు.

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమరావతి కేంద్రంగా  ఏపీ హైకోర్టు నడుస్తోంది. ఉమ్మడి హైకోర్టును విభజించారు. అదే రోజు నుండి ఏపీకి, తెలంగాణ హైకోర్టులు పనిచేయనున్నట్టు నోటిఫికేషన్ విడుదలైంది.

అయితే ఏపీలో సిటీ సివిల్ కోర్టు  భవన సముదాయంలో  హైకోర్టును  నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది. కానీ, అప్పటికే ఈ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయంలో  హైకోర్టు తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు.

మరో వైపు సిటీ సివిల్ కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సిటీ సివిల్ కోర్టు భవనం ఆవరణలోనే  ఏపీ హైకోర్టు పనులను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 23 కోర్టు హల్స్ ఏర్పాటు చేశారు. జీ ప్లస్ టూ సిటీ సివిల్ కోర్టు భవనాన్ని నిర్మించారు. రెండు లక్షల 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు.