సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్.. రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలన్న సీజేఐ..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్రా సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్రా సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని.. అక్కడ ప్రతిపక్షాలు అణచివేయబడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన సిద్దార్థ లూత్రా.. ఈ నెల 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు.
అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అప్పుడు దానిని చూస్తామని చెప్పారు. ఇక, ఈరోజు మెన్షన్ జాబితాలో పిటిషన్ లేనందున.. విచారణ జరిపేందుకు నిరాకరించారు. ఇక, చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వాన్ని, అజేయ్ కల్లాంను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది. ఇక, చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే.