తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రతినిత్యం సుప్రభాతసేవ ద్వారా వేద పండితులు మేల్కొలుపుతారని తెలిసిందే. ఆ సేవను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మకు కూడా అమలు చేయనున్నారు.

ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఈ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించారు.

తొలుత మేళతాళాలు, పండితుల వేదమంత్రాల నడుమ పవిత్ర కృష్ణానది నుంచి తీసుకువచ్చిన జలంతో అమ్మవారిని అభిషేకించారు. సుప్రభాత సేవ అనంతరం అమ్మవారి అంతరాలయం ద్వారాలు తెరుచుకున్నాయి.

శ్రీవారి ఆలయంలో నిత్యం వినిపించే సుప్రభాతం కనకదుర్గమ్మ భక్తులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సుప్రభాతసేవ టికెట్టు ధర రూ.300గా ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 

"