హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసలతో ముంచెత్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డితోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ తనకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు. 

గురువారం తన జన్మదినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుతో సాక్షి చానెల్ నిర్వహించిన మనసులో మాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుండడడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు.  

గతంలో వైఎస్‌ను కలిసేందుకు వాళ్లింటినకి వెళ్లేవాణ్నని, అప్పటినుంచీ వైఎస్‌ జగన్‌తో తనకు సత్సంబం ధాలున్నాయని చెప్పారు. ప్రజలకు ఏదో చేయాలి, వారి కష్టాలను తీర్చాలన్న పట్టుదల ఉన్న వ్యక్తి జగన్‌ అని కృష్ణ అభిప్రాయపడ్డారు.

"ఎండాకాలం. పైగా మే నెల. ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు. అయినా జగన్‌ ప్రజల్లోనే ఉంటూ, వారికోసం అంతగా కష్టపడటం గొప్ప విషయం" అని కొనియాడారు. 2019లో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ స్పష్టం చేశారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్‌ కూడా ఎంపీయేనని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరిదాకా మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రతి ఒక్కటీ ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసునన్నారు.