విజయవాడ: కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీకి ప్రమోషన్ వచ్చింది. ఆమెను ఏపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ నియామక ఉత్తర్వులు పంపించింది. 

అయితే రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా విశాఖట్నంకు చెందిన రమణీకుమారిని నియమించింది. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రజల్లో చొచ్చుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన అనేక ఉద్యమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 

అంతేకాదు రాష్ట్రరాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆమె వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను పీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్దితో నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సుంకర పద్మశ్రీ  స్పష్టం చేశారు.