Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి సునీల్ షాక్: కాకినాడ ఎంపీ అభ్యర్థిగా రాజప్ప!

కాకినాడ ఎంపీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా తోట నరసింహం ఉన్నారు. గత ఎన్నికల్లోనే అయిష్టంగా ఎంపీకి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంట్ కు వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు తోట నరసింహం. 

sunil twist to tdp: kakinada tdp mp candidate rajappa !
Author
Kakinada, First Published Oct 17, 2018, 6:52 PM IST

కాకినాడ: కాకినాడ ఎంపీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా తోట నరసింహం ఉన్నారు. గత ఎన్నికల్లోనే అయిష్టంగా ఎంపీకి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంట్ కు వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు తోట నరసింహం. 

దీంతో తెలుగుదేశం పార్టీకి కాకినాడ ఎంపీ అభ్యర్థి కరువయ్యారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. సునీల్ సోదరుడు టీడీపీలోకి వెళ్లాలని తమ్ముడిపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో పలుమార్లు చంద్రబాబు నాయుడును సైతం కలిశారు. అయితే చంద్రబాబు నాయుడు స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో చలమలశెట్టి సునీల్ జనసేనకు జై కొట్టారు. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ జనసేన తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

చలమలశెట్టి సునీల్ చేజారిపోవడంతో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి లేకుండా పోయారు. అటు వైసీపీకి కూడా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి లేరు. ఉభయగోదావరి జిల్లాలలో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. టీడీపీ, వైసీపీలలో టిక్కెట్స్ కన్ఫమ్ కాని వాళ్లు జనసేనకు జై కొడుతున్నారు. ముత్తా గోపాలకృష్ణ, శశిధర్, పితాని బాలకృష్ణ, కందుల లక్ష్మీదుర్గేష్ లు అలా చేరిన వారే కావడం విశేషం. 

జనసేనలో చేరబోతున్నట్లు సంకేతాలిచ్చిన చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీకి అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. సునీల్ షాక్ తో తేరుకున్న టీడీపీ కాకినాడ లోక్ సభ స్థానం భర్తీకి చర్యలు చేపట్టింది. సునీల్ స్థానంలో కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చినరాజప్ప చంద్రబాబు మన్నలను పొందారు.  

ఈ నేపథ్యంలో చినరాజప్పను కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించితే గెలుపు ఖాయమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.  గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనూ చినరాజప్ప కాకినాడ పరిసర ప్రాంతాల్లో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని అవి రాబోయే ఎన్నికలకు కలిసొస్తాయని చెప్తున్నారు.  

ప్రస్తుతం రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానికేతరుడైన చినరాజప్ప పెద్దాపురం నుంచి గెలుపొందడం డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి పదవులను కైవసం చేసుకున్నారు. అయితే స్థానికత అంశం తెరపైకి రావడంతో ఈసారి రాజప్ప అక్కడ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన నేతలతో పలుమార్లు తాను ఎంపీగా వెళ్లే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా వెళ్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టవాలో కూడా ఇప్పటికే చినరాజప్ప డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.   

 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున చలమలశెట్టి సునీల్ రాజకీయారంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాభవం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సునీల్ ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

అయితే ఈసారి జనసేన పార్టీ తరపున కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగాలని సునీల్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలైన సునీల్ పై ప్రజల్లో సానుభూతి ఉందని ఆ సానుభూతి పవన్ కళ్యాణ్ గ్లామర్ కాపుసామాజిక వర్గం ఓట్లు తనకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 

సునీల్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్ధిత్వంపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. ఇప్పటికే రెండు సార్లు పవన్ కళ్యాణ్ ను కలిసినా పార్టీలో చేరకపోవడం వెనుక స్పష్టమైన హామీ లేకపోవడమేనని సమాచారం. సునీల్ కాకినాడ పార్లమెంట్ స్థానం లేదా జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ అడుగుతున్నారని అయితే పవన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పవన్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఇప్పటికే జిల్లాలో చేరిన నేపథ్యంలో త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. 

ఇకపోతే చలమలశెట్టి సునీల్ కు ధీటైన అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్పేనని పార్టీ భావిస్తోంది. డిప్యూటీ సీఎంగా, హోం శాఖ మంత్రిగా కీలక హోదాలో ఉన్న రాజప్ప తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అటు సౌమ్యుడిగా, మంచివాడిగా పేరుండటం మరింత కలిసొచ్చే అవకాశం. 

అలాగే పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినా రాజప్పకి కాకినాడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పెద్దాపురం ఏరియా మిల్లర్లతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలలో రాజప్పకు కలిసొచ్చే అంశాలని  పార్టీ భావిస్తోంది. మరి చినరాజప్ప పార్లమెంట్ కు పోటీ చేస్తారా లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios