టిడిపి కేంద్రమంత్రి ఒక్కసారిగా మీడియా గాలి తీసేసారు. అది కూడా నియోజకవర్గాల పెరుగుదల ప్రచారంపైనే కావటం విశేషం. ఇంతకీ విషయం ఏమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విషయంపై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా తెలుగు ముఖ్యమంత్రులు పట్టువదలటం లేదు. ఎందుకంటే వారి ఇబ్బందులు వారికి ఉన్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే రేపటి ఎన్నికల్లో ఇటు చంద్రబాబునాయుడు అటు కెసిఆర్ ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఓ రేంజిలో ఉంటాయనటంలో సందేహం లేదు.

అందుకనే కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించి సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నది ముఖ్యమంత్రుల పట్టుదల. తాజాగా ఇదే విషయమై నాలుగు రోజులుగా మళ్ళీ ప్రచారం ఊపందుకున్నది. సీట్ల సంఖ్యను పెంచటానికి కేంద్రం సుముఖంగా ఉందని ఒకరోజు ప్రచారం జరిగింది. మరుసటి రోజు హోంశాఖ నుండి ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయని ఇంకో ప్రచారం. ఈరోజేమో ప్రధాని సంతకం ఫైలుపై అయిపోయిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

అదే విషయమై ఢిల్లీలో టిడిపి కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉంటామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ఫైలుపై ప్రధాని సంతకం చేశారన్న విషయాన్ని మీడియా ప్రస్తావించింది. వెంటనే కేంద్రమంత్రి బదులిస్తూ ఆ విషయం తనకు తెలీదన్నారు. ప్రధాని సంతకం అయిపోయిందన్న విషయం మీడియా చెబితేనేతనకూ తెలిసిందని ఎద్దేవా చేశారు. దాంతో  ఏం మాట్లాడాలో అర్దంకాక మీడియా తెల్లమొహం వేసింది.