మోడీతో విభేదం మంచిది కాదని చంద్రబాబుతో చెప్పానన్నారు సుజనా చౌదరి. బీజేపీలో చేరిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోడీ దేశానికి సరైన నాయకుడని.. మోడీతో విభేదం మంచిది కాదని బాబుతో చెప్పానన్నారు.

బీజేపీలో చేరినందుకు ఆనందంగా ఉన్నా టీడీపీని వీడినందుకు బాధగా ఉందని సుజనా తెలిపారు. చంద్రబాబు కొన్ని  తప్పులు చేశారని చౌదరి అన్నారు. ప్రత్యేక హోదా అన్నది తన దృష్టిలో ముగిసిపోయిన అధ్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.. బీజేపీలో చేరితే దేశానికి మరింత సేవ వచ్చునని ఆయన తెలిపారు. తనకు రాజకీయ గురువు చంద్రబాబేనని అయితే భవిష్యత్తు దృష్ట్యా పార్టీ వీడక తప్పలేదని స్పష్టం చేశారు.

మూడున్నరేళ్లు ప్రధాని మోడీ దగ్గర పనిచేశానని..  ఎన్డీయే నుంచి బయటకు రావొద్దని బాబుకు చెప్పానని సుజనా తెలిపారు. 2004 నుంచి వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

బీజేపీతో ఘర్షణ వైఖరి వల్లే ఏపీ విభజన చట్టం అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయామని సుజనా ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీలో తన గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని... పార్టీ మారినా తెలుగుదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వ్యాపార విషయాల్లో తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. రాజ్యాంగం ప్రకారం ఎవరిపైనైనా దర్యాప్తు చేయవచ్చునని.. నాపై విచారణ జరిగితే తాను తప్పు చేశానని కాదన్నారు. తాను హత్యలు , మోసాలు చేయలేదని స్పష్టం చేశారు.