తొమ్మిదో తరగతి విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడు చెయ్యి నరికి.. ముఖంపై  చర్మం వలిచి మరీ చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిందూపురం మండలం కొటిపి గ్రామానికి చెందిన నాగరాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన నవీన్‌(13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నాగరాజు గోళ్లాపురం పారిశ్రామికవాడలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తండ్రి పనిచేస్తున్న పరిశ్రమ వద్ద ద్విచక్ర వాహనానికి పంక్చర్‌ వేయించుకుని వస్తానంటూ వెళ్లిన నవీన్‌ రాత్రయినా తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో నవీన్‌ శవమై కనిపించాడు. దుండగులు అతడి చేతిని భుజం వరకు నరికేశారు. మొహంపై చర్మం ఒలిచి, రెండు కళ్లను పీకేసిన ఆనవాళ్లున్నాయి. ఎక్కడో హత్య చేసి, సోమవారం తెల్లవారు జామున ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశులు తెలిపారు. ఇదిలా ఉండగా, నవీన్‌ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు చేపట్టి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.