నరసాపురం: ఎన్నికల అనంతరం ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు గెలుపు ఓటములపై అంచనాలు వేసుకునే పనిలో పడ్డారు. మరికొందరైతే విశ్రాంతి కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలలో షికార్లు చేస్తున్నారు. 

కానీ జనసేన పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన నేతలు అప్పుడే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ అందరిమన్నలను పొందుతున్నారు. 

ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ, విశాఖపట్నం జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షడు పవన్ కళ్యాణ్ సోదరుడు ,నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి, మెగా బ్రదర్ నాగబాబు సైతం నరసాపురం నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. 

ఎన్నికల అనంతరం మండుటెండల్లో నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలపై ఆరా తీస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై ఆరా తీస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు పశ్చిమకాలువను సందర్శించారు. 

కాలువలోకి దిగి నీటిని పరిశీలించారు. గోదావరి నీరు ఎంతో స్వచ్ఛమైనవని అభిప్రాయపడ్డారు. తాను చిన్నతనంలో పాలకొల్లులోని ఇలాంటి కాలువల్లో ఆడుకునేవారినని అక్కడ పర్యావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని గుర్తుకు తెచ్చారు. విజ్జేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలను శుభ్రపరచి ప్రజలకు తాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాగబాబు ఆరా తీస్తున్నారు.