టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ జరిగే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర చంద్రబాబు బుధవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా తొక్కిసలాట జరిగింది. గందరగోళంలో పలువురు కార్యకర్తలు కాలువలో పడి మరణించగా.. మరో నలుగురి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

దీంతో సభను మధ్యలోనే ఆపి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన చంద్రబాబు.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. మృతులను దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), కలవకురి యనాది (కొండమూడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు), కకుమాను రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)గా గుర్తించారు. మరణించినవారిలో మరో ఇద్దరిని గడ్డం మధుబాబు (కందుకూరు మండలం ఒగురు), రాజేశ్వరి (కందుకూరు)లుగా గుర్తించారు.

అమాయకలు చనిపోవడం బాధ కలిగిస్తోందదని చంద్రబాబు అన్నారు. మరణించినవారి కుటుంబాలకు అండగా ఉంటామని, వారి కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో చదివిస్తామని ఆయన చెప్పారు. కందుకూర సభను సంతాపసభగా ఆయన ప్రకటించారు. మరణించినవారి అంత్యక్రియలు పార్టీ తరఫున నిర్వహిస్తామని ఆయన చెప్పారు.శ్రేణుల అభిమానం అదుపు తప్పి బాధాకరమైన సంఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పారు. గాయపడినవారు కోలుకునేవరకు అండగా ఉంటామని చెప్పారు.

కందుకూరు ఘటనపై చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు. గాయపడిన ఐదుగురు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

కందుకూరు ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు కందుకూరు సభలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తల మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని, వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని లోకేష్ అన్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.