విశాఖలో పెళ్లికూతురు మృతి కేసు .. ఆమె ఇష్ట ప్రకారమే వివాహం, ఆత్మహత్య ఎందుకు : సృజన సోదరుడు

తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని అంటున్నాడు విశాఖలో పెళ్లి పీటలపై చనిపోయిన సృజన సోదరుడు విజయ్. ఆమె ఇష్టపూర్వకంగానే ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి సంబంధం కుదిర్చాయని చెప్పాడు. 
 

srujana brother vijay press meet on his sister death

విశాఖలో పెళ్లి పీటలపైనే  నవవధువు మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మృతురాలు సృజన సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడారు. తన సోదరి ఆత్మహత్య చేసుకుందనే వార్తలను ఆయన ఖండించారు. ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి కుదిర్చామని.. అయితే వివాహ సమయంలో పీరియడ్స్ సమస్య రాకుండా వుండేందుకు సృజన కొన్ని మాత్రలు వేసుకుందని విజయ్ చెప్పాడు. వాటి కారణంగానే రెండు రోజులు ఇబ్బంది పడిందని.. అంతకుమించి ఆమె మరణానికి కారణాలు తమకు తెలియవని తెలిపారు. సృజనది ఆత్మహత్య కాదని విజయ్ స్పష్టం చేశారు. 

కాగా.. సృజన (vizag bride death) మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ఆమె మృతిపై నిన్నటి నుంచి తెలుగు నాట అనేక అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. సృజన హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు ఉండటంతో ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సృజనను చికిత్స నిమిత్తం మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు.. ఆమె గుర్తు తెలియని విషం తీసుకోవడం వల్ల చనిపోయిందని నివేదిక ఇచ్చారు. దీంతో పోస్ట్‌మార్టంలో ఏం తేలబోతుందనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు Srujana మరణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సృజన మొబైల్ కోసం పోలీసులు తల్లిదండ్రులను కోరారు. అయితే Mobileను ఆలస్యంగా పోలీసులకు సృజన కుటుంబ సభ్యులు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే అందులో చాటింగ్స్, పోన్ కాల్స్ సమాచారం డిలీట్ చేసి ఉంది. ఈ ఫోన్‌లో మిస్డ్ కాల్స్ లిస్ట్ మాత్రమే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సృజన ఫోన్లో ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు టెక్ నిపుణులను సంప్రదించారు పోలీసులు. 

కాగా.. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి వుంది. దీనికి సంబంధించి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్  కూడా జరుపుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వధువు సృజన మృతదేహం నుండి నమూనాలను కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజిబిజీగా ఉందని బంధువులు చెబుతున్నారు.  మరోవైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా , ఉత్సాహంగా గడిపిన క్షణాలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.

అంతకుముందు బుధవారం ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు కడుపునొప్పి రావడంతో ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు .. టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే వుందని.. కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి వుండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర , బెల్లం పెడుతుండగా సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios