విశాఖపట్నం: విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నమ్రత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు హాస్పిటల్ ఎండీ నమ్రతను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

విశాఖ నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా పిల్లల అక్రమరవాణా కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.  సృష్టి యూనివర్సల్ ఆసుపత్రికి నగరంలోని పద్మజ ఆసుపత్రితో లింకులున్నట్లు తెలిసి ఈ రెండు హాస్పిటల్స్ కు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు చేసినట్లు తెలిపారు. క్లిష్టమైన డెలివరీ కేసులను డాక్టర్ నమ్రత డాక్టర్ పద్మజ కు రిఫర్ చేసేదని తేలిందన్నారు. 

''ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలవరీ కేసును నమ్రత పద్మజ హాస్పిటల్ కు అప్పగించింది.  డాక్టర్ నమ్రత సూచనలు మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తల్లిని, కుటుంబసభ్యులను నమ్మించారు. అనంతరం ఆ బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టించి విజయనగరంకు చెందిన దంపతులుకు రూ.13 లక్షలకు విక్రయించారు'' అని సిపి వెల్లడించారు.

దీంతో ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు. డాక్టర్ పద్మజ, ఆశావర్కర్ నూకరత్నంను అరెస్టు చేసినట్లు  తెలిపారు. దీంతో సృష్టి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసులో అరెస్టుల సంఖ్య  8కి చేరింది. 

read more   హైదరాబాదులోనూ నమ్రత మోసాల బాగోతం: దంపతుల ఫిర్యాదు

పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి ఈ అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. విశాఖపట్టణంలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 56 పసిపిల్లలను విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు.  

విశాఖపట్టణంలోని సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో కూడ పిల్లల అక్రమ రవాణా చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి నుండి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. వీటి ఆధారంగా విచారణ జరిపి తాజాగా డాక్టర్ పద్మజను అరెస్ట్ చేశారు.