తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఏపీలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వచ్చే రెండేళ్లలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తామని ఈవో లవన్న వెల్లడించారు. 

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ భక్తుల భద్రతపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆలయ పరిధిలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంపై అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 

Also Read: ఎక్స్‌గ్రేషియా ఎవరికిచ్చారు.. ఎందుకీ తప్పుడు మాటలు, మా బిడ్డ విలువ 10 లక్షలా : టీటీడీపై లక్షిత తాత వ్యాఖ్యలు

రాత్రి పూట జంతువులు ఆలయ పరిధిలోకి రాకుండా టపాసులు కాల్చాలని నిర్ణయించినట్లు శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న తెలిపారు. త్వరలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫెన్సింగ్ నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల 30 లక్షలకు టెండర్ పిలుస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తామని లవన్న వెల్లడించారు. 

కాగా.. అలిపిరి కాలినడక మార్గం శుక్రవారం రాత్రి ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు అటవీ శాఖ ఇప్పటికే 24X7 ప్రాతిపదికన రెండు బోనులను సిద్ధంగా ఉంచినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

అంతేకాకుండా ఈ మార్గంలో గాలి గోపురం పాయింట్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు తిరుమలకు కాలినడక మార్గంలో పిల్లలతో కలిసి వెళ్తున్న తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక, అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత టీటీడీ మరిన్ని చర్యలు తీసుకోనుంది. 


Also Read: భక్తుల కోసం కర్రలు సిద్దమట... ఇక చిరుతల్ని తరమడమేనా...: టిటిడి నిర్ణయంపై ట్రోలింగ్.. (వీడియో)

అంతేకాకుండా.. తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారుల్లో పిల్లల అనుమతిపై టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాకుండా నడకదారిలో వెళ్తున్న పిల్లలకు ట్యాగ్‌లు కూడా కడుతున్నారు. కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు మిస్ అయితే.. ఈ ట్యాగ్‌లు వారిని కనిపెట్టేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. పిల్లలకు కట్టే ట్యాగ్‌లో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీసులు కంట్రోల్ నెంబర్ రాస్తున్నారు. ఇక, రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తర్వాత బైక్‌లకు అనుమతి నిరాకరించినట్టుగా టీటీడీ తెలిపింది.