తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రక్షఫణ కోసం కర్రలు ఇచ్చేందుకు టిటిడి సిద్దమయ్యింది.
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళుతున్న భక్తులు అడవిజంతువులు దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొండపైకి వెళ్లే నడకమార్గంలో చిన్నారులను చిరుత ఎత్తుకెళ్లిన ఘటనలు కలకలం రేపాయి. ఓ చిన్నారి చిరుత దాడినుండి ప్రాణాలతో బయటపడగా లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి మాత్రం మృతిచెందింది. చిన్నారి మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఇటీవల చోటుచేసుకున్న ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అప్రమత్తమయ్యింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిడిపి నిర్ణయించింది. ఇందులో భాగంగానే అలిపిరి నడకమార్గంలో కొండపైకి వచ్చే భక్తులకు రక్షణకోసం కర్రలు ఇవ్వనున్నట్లు టిడిపి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అలాగే భక్తుల రక్షణ కోసం టిటిడి ఏర్పాటుచేసిన హైలెవల్ కమిటీ మరికొన్ని నిర్ణయాలను కూడా భూమన ప్రకటించారు.
వీడియో
టిడిపి నిర్ణయం మేరకు భక్తులకు ఇచ్చేందుకు ఊతకర్రలను సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎప్పటినుండి భక్తులకు కర్రలను ఇస్తారో ఖచ్చితంగా తెలియకున్న అతి త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నడకమార్గంలోని ఏవయినా అడవి జంతువులు వచ్చినా భక్తుల చేతిలో కర్రలు చూసి బయపడి పారిపోతాయని... దీనివల్ల భక్తులకు రక్షణ లభించే అవకాశం వుందని టిడిపి అధికారులు చెబుతున్నారు.
దట్టమైన అటవీప్రాంతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం వుంది. స్వామివారి సన్నిధికి కాలినడకన చేరుకుంటామని మొక్కుకునే భక్తులు అలిపిరి మార్గంలో నడుస్తుంటారు. అయితే ఈ మార్గంలో తరచూ చిరుత, ఎలుగుబంటి, అడివిపంది వంటి అడవిజంతువులు, విషపూరిత పాములు భక్తులకు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ చిరుత దాడిలో చిన్నారి మృతిచెందడంతో సంచలనంగా మారింది.
చిరుత దాడిలో చిన్నారి మృతిచెందడాన్ని సీరియస్ గా తీసుకున్న టిటిడి కాలినడకన వచ్చే భక్తులకు భద్రతను కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ ఏర్పటు చేసింది. ఈ కమిటీ నడకమార్గంలో జరుగుతున్న ప్రమాదాలపై అధ్యయనం చేసి టిటిడికి పలు సూచనలు చేసింది. వాటిని అమలుచేసి ఇకపై భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా చూడాలని భావిస్తోంది టిటిడి.
