రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నీలం సంజీవరెడ్డి సాగర్ డ్యామ్ కు  ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తెలిపారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని రాజేంద్ర  సింగ్ హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంకు ఏదైనా విపత్తు సంభవిస్తే దాదాపు సగం ఆంధ్ర కనిపించకుండా పోతుందని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు..

‘గంగాజల్‌ సాక్షరత్‌’ యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. నదుల ప్రక్షాళన, పరిరక్షణతోపాటు మాతృభాషపైనా వారి మధ్య చర్చ జరిగింది. 

తాను మంగళవారం శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించానని రాజేంద్రసింగ్‌ తెలిపారు. డ్యామ్‌ నిర్వహణకు 600 మంది సిబ్బంది అవసరమని, కానీ 100 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు.

తీవ్ర హైడ్రోలిక్‌ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని, దీంతో డ్యాం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. గత ప్రభుత్వాలు ఇంత పెద్ద పాజ్రెక్టులు కడితే కనీసం నిర్వహణ కూడా చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్‌ కొట్టుకుపోతుందని, దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 

నల్లమల యురేనియం మైనింగ్‌తో కృష్ణా నది కాలుష్యం అవుతుందని, దీని ప్రభావం ప్రజలతో పాటు జంతువులపైనా పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని వివరించారు. ఈ నేపథ్యంలో నల్లమలలో మైనింగ్‌ చేపట్టకూడదని ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు