విజయవాడ: నిందితుడు శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలనే దాడి చేశాడని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో శ్రీనివాస రావును ఒక్కడినే నిందితుడిగా చేర్చింది. 

జగన్ కదలికలపై శ్రీనివాస రావుకు ప్రతి విషయమూ తెలుసునని కూడా ఎన్ఐఎ చెప్పింది. తన పథకాన్ని అమలు చేయడానికి శ్రీనివాస రావు హేమలత సాయం కోరాడని, జగన్ తో శ్రీనివాస రావు సెల్ఫీ తీసుకోవడానికి హేమలత వైసిపి నేతలతో మాట్లాడి వీలు కల్పించిందని ఎన్ఐఎ తన చార్జిషీట్ లో వివరించింది. 

ఎన్ఐఎ చార్జిషీట్ ప్రకారం.... హైదరాబాదు వెళ్లడానికి జగన్ అక్టోబర్ 25వ తేదీన జగన్ విమానాశ్రయానికి వస్తున్నారని హేమలత శ్రీనివాస రావుకు చెప్పింది. జగన్ ఆ రోజు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చి విఐపీ లాంజ్ లోకి వెళ్లారు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని తప్పించుకోవడానికి శ్రీనివాస రావు ఓ బాటిల్ తీసుకుని వచ్చి అవకాశం కోసం ఎదురు చూస్తూ పక్కన నించున్నాడు. 

జగన్ విమానం ఎక్కడానికి లేచి వెళ్తుండగా, శ్రీనివాస రావు దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు. ఎడమ చేతితో సెల్ఫీ తీసుకుంటూ, కుడి చేతితో తన చొక్కాలో ఉన్న కత్తి తీసి దాడి చేశాడు. జగన్ మెడపై వేటు వేయడానికి ప్రయత్నించాడు. అయితే, అది మెడపై తగలకుండా ఎడమ చేయి భుజంపై తగిలింది. 

శ్రీనివాస రావు నేరచరిత్రను తెలుకోకపోవడంపై ఎన్ఐఎ విమానాశ్రయ అధికారులను తప్పు పట్టింది. ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా శ్రీనివాస రావుకు ఎంట్రీ పాస్ ఇచ్చారని, ఆ పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీనివాస రావుపై ఏ విధమైన కేసులు లేవని, శ్రీనివాస రావు స్వస్థలానికి సంబంధించిన కేసులను పట్టించుకోలేదని వివరించింది. 

ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో శ్రీనివాస రావుపై కేసు ఉందని ఎన్ఐఎ తెలిపింది. కోళ్ల పందేలకు వాడే కత్తిని శ్రీనివాస రావు 2018 జనవరిలో తన స్వస్థలంలో తీసుకున్నాడని ఎన్ఐఎ తెలిపింది.