అమరావతి: తెలంగాణ కేడర్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారని అంటున్నారు. అందుకు ఆయన అంగీకరించారని తెలుస్తోంది.

 శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చిన ఆమె ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. 

శ్రీలక్ష్మి ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీలక్ష్మి దరఖాస్తుపై సానుకూలంగా స్పందిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర ఏపీకి వెళ్లడం ఖాయమైంది. మరి కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఎపి సర్వీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.