సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హైకోర్టు నుంచి క్లీన్ చీట్ రావడంతో ఆమెకు మరో శుభవార్త అందనుందనే ప్రచారం కూడా సాగుతుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. పదేళ్ల కిందట నమోదు చేసిన ఈ కేసులో శ్రీలక్ష్మి కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారు. తాజాగా ఆమెకు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీటును కూడా సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు నుంచి క్లీన్ చీట్ రావడంతో ఆమెకు మరో శుభవార్త అందనుందనే ప్రచారం కూడా సాగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు క్లీన్ చీట్‌తో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు కావడానికి అడ్డంకులు తొలగిపోయాయని.. ఆ పదవిలో ఆమె నియమితులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ సాగుతుంది.
ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సమీర్ శర్మ పదవీకాల నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. మరోసారి పొడగింపు అనేది సాధ్యపడకపోవచ్చు. మరోవైపు ప్రస్తుతం సమీర్ శర్మ అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నూతన సీఎస్ విషయంలో సీఎం జగన్ ఆలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం జగన్ ఎంపిక శ్రీలక్ష్మి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ విషయంలో స్పష్టత రాబోతుంది.
శ్రీలక్ష్మి అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంతకాలం సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు. అయితే జగన్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని నెలలకే.. ఏపీకి వచ్చిన శ్రీలక్ష్మి కొద్ది కాలంలోనే రెండు సార్లు ప్రమోషన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
శ్రీలక్ష్మిపై కేసు ఇదే..
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. అనంతపురం జిల్లా ఓబుళాపురం, మలపనగుడి గ్రామాల్లోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని ఓఎంసీకి మైనింగ్ లీజుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2009 డిసెంబర్ 7న సీబీఐ ఓఎంసీపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ.. 2012 మార్చి 30న ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్రీలక్ష్మి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
ఓఎంసీకి అనుకూలంగా అక్రమ మైనింగ్ లైసెన్సులను మంజూరు చేసేందుకు కుట్ర పన్నడం ద్వారా ఆమె తనకు లభించిన అధికారాలను దుర్వినియోగం చేసిందని అభియోగం మోపింది. అనంతపురంలో మైనింగ్ లీజులు మంజూరు చేయడంలో ఓఎంసీ ప్రమోటర్, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డితో ఆమె కుమ్మక్కైనట్లు సీబీఐ పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి 2011 నవంబర్ 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఇక, 2012 అక్టోబర్‌లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది. 2021లో సెప్టెంబరులో ఆమె విచారణను ప్రారంభించడానికి సీబీఐ కోర్టుకు స్వేచ్ఛ ఉందని తీర్పు వెలువరించింది. ఇక, ఈ కేసును కొట్టివేయాలని ఆమె వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గత నెలలో కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆమెకు తాజాగా తెలంగాణ హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. 2016లో ప్రభుత్వం ఆమె సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2020లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) నుండి ఆర్డర్ పొందిన తర్వాత శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చుకుంది. గతేడాది ఆమెకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది.
