శ్రీకాకుళం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధిపొందేందుకే వైఎస్ జగన్ బీసీల జపం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గర్జన సభలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాం బీసీలకు సువర్ణయుగమని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా బీసీల కోసం అమలు చేశారని గుర్తు చేశారు. 

అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. బీసీల పట్ల జగన్‌ది కపట ప్రేమ మాత్రమేనని విమర్శించారు. తెలంగాణలో తొలగించిన బీసీ కులాలపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తే వైఎస్ జగన్ కనీసం స్పందించలేదన్నారు. మోదీ, కేసీఆర్ డైరెక్షన్లోనే వైఎస్ జగన్ నడుస్తున్నారని ఆరోపించారు. 

అందువల్లే మోదీకి వ్యతిరేకంగా జగన్‌ మాట్లాడటం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్‌ ఆడుతున్న డ్రామాలకు బీసీలు తగిన గుణపాఠం చెప్తారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.