Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ దెబ్బ:గుజరాత్‌లో చిక్కుకొన్న శ్రీకాకుళం మత్స్యకారుడు మృతి

 గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు మంగళవారం నాడు మృతి చెందాడు, తమను స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు  ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ చిక్కుకొన్న మత్స్యకారుల్లో ఇద్దరు మృతి చెందారు.

Srikakulam fisherman kamaraj passes away in Gujarat
Author
Srikakulam, First Published Apr 22, 2020, 10:38 AM IST

శ్రీకాకుళం: గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు మంగళవారం నాడు మృతి చెందాడు, తమను స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు  ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ చిక్కుకొన్న మత్స్యకారుల్లో ఇద్దరు మృతి చెందారు.

గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ జిల్లాలోని వేరావల్ గ్రామంలోని ఫిషింగ్ హార్బర్ లో ఉత్తరాంధ్రకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఉన్నారు. లాక్ డౌన్  కారణంగా గుజరాత్ నుండి ఏపీకి వచ్చే అవకాశం లేకపోయింది. 

గత ఏడాది ఆగష్టు మాసంలో వీరంతా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వారంతా సముద్ర జలాల్లోనే చేపల వేట కొనసాగిస్తారు. ఎనిమిది నెలల పాటు వీరంతా సముద్రంలోనే గడుపుతారు. నెలలో కనీసం 25 రోజుల పాటు వారంతా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాతే వారు ఒడ్డుకు చేరుకొంటారు.

గత 25 రోజుల నుండి వారంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. దీంతో బోటు యజమానులు వారికి జీతాలు ఇవ్వలేదు. దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు.

వీరు ఉంటున్న  ప్రాంతంలో మురికి కాలువ ఉంది. ఈ మురికి కాలువ కారణంగా దోమలు విపరీతంగా ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కనీసం తాగేందుకు కూడ మంచినీళ్లు లేని పరిస్థితులు ఉన్న విషయాన్ని వారు శ్రీకాకుళం జిల్లా అధికారులకు చెప్పారు.

also read:గుజరాత్ సీఎంకి జగన్ ఫోన్: ఏపీ మత్స్యకారులకు భోజనం,వసతి కల్పించాలని వినతి

దీంతో అనారోగ్యానికి గురైన ఎచ్చెర్ల మండలానికి చెందిన కామరాజ్ అనే మత్స్యకారుడు మంగళవారం నాడు రాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం నాడు ఉదయం మత్స్యకారులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు.

తమను శ్రీకాకుళం జిల్లాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరారు. గతంలో కూడ అనారోగ్యంతో ఒక్క మత్స్యకారుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహన్ని శ్రీకాకుళం పంపే పరిస్థితులు లేకపోవడంతో అక్కడ ఉన్న మత్స్యకారులే మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమాన్ని మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చూపారు.

ఇప్పటికే ఇద్దరు మత్స్యకారులు మృతి చెందడంతో మిగిలిన వారిలో కూడ ఆందోళన మొదలైంది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఏపీ సీఎం వైస్ జగన్ మంగళవారం నాడు ఫోన్ లో మాట్లాడారు. వేరావల్ గ్రామంలో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు సరైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios