గుజరాత్ సీఎంకి జగన్ ఫోన్: ఏపీ మత్స్యకారులకు భోజనం,వసతి కల్పించాలని వినతి
గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ఫోన్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
అమరావతి: గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ఫోన్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఏపీ రాష్ట్రం నుండి గుజరాత్ రాష్ట్రానికి ఉపాధి కోసం వలస వెళ్లిన మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ జిల్లాలోని వేరావల్ గ్రామంలోని ఫిషింగ్ హార్బర్ లో ఉత్తరాంధ్రకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా గుజరాత్ నుండి ఏపీకి వచ్చే అవకాశం లేకపోయింది.
గత ఏడాది ఆగష్టు మాసంలో వీరంతా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వారంతా సముద్ర జలాల్లోనే చేపల వేట కొనసాగిస్తారు. ఎనిమిది నెలల పాటు వీరంతా సముద్రంలోనే గడుపుతారు. నెలలో కనీసం 25 రోజుల పాటు వారంతా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాతే వారు ఒడ్డుకు చేరుకొంటారు.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రైలుకు వేలాడుతూ వెళ్తున్న ముగ్గురి అరెస్ట్
గత 25 రోజుల నుండి వారంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. దీంతో బోటు యజమానులు వారికి జీతాలు ఇవ్వలేదు. దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు.
ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో ఆయన మంగళవారం నాడు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేశారు. గుజరాత్ లో చిక్కుకొన్న ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. వారికి భోజనంతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.ఈ విషయమై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడ సానుకూలంగా స్పందించినట్టుగా అధికారులు తెలిపారు.